Tuesday, April 22, 2008

25వ సర్గ

మానవ కాంతను రాముని పత్నిని
రాక్షస భార్యగ తగని దానను
మీ మాటల నేను లెక్కజేయను
ముక్కలు కోసి విధిగా తినుడని
భయముగొల్పెడి వికృత రూపుల
బాధలనిచ్చెడి పరుష భాషణలు
వణుకుతు వింటూ నిలచిన సీత
కన్నీరు ధారగ ఒడిలో రాలగ
అవిశిన గుండెతొ గద్గద స్వరమున
వారిని చూచుచు బదులుగ పలికెను. 3

అడవుల దారులు మరచి
నక్కల మందకు చిక్కి
గజగజ వణికిన లేడివలె
రాక్షసి మూకల నడుమ
మాటల ఈటెలు ఓర్చుచు
కన్నీరోడ్చుచు నిలిచిన
సీతను చూసెను పావని 5
గుండెలు అవిసే విధముగ ఏడ్చి
డస్సిన మనసుతో రాముని తలచుచు
శింశుప వృక్షపు చెంతన నిల్చి
పూలతొ నిండిన కొమ్మను వంచి
దానిని చూచుచు ఇంకను వగచెను 7

కన్నులగారెడి నీటితొ
ఎత్తగు ఎదలను తడుపుతు
అంతము కానని బాధను
పెదవున నడుమున నొక్కుచు
బాధకు భయమును చేరగ
గాలికి చిక్కిన ఆకులా వణకుతు
రామలక్ష్మణుల అత్తమామల
బాధతొ తలచుచు, దీనయయి చూచుచు
శింశుప వృక్షము కడ నిలచిన
నిట్టూర్పులు విడిచెడి సీతను, పావని
బుసలు కొట్టెడి నాగుల బోల్చెను 12
మృత్యువు పిలచిన రాదను
లోకోక్తులు తప్పక నిజమని నమ్ముదు
ఆటుపోటుల దెబ్బకు పగిలి
నడి సంద్రమున కూలిన నావ వలె
పరుగిడు నది బలముగ కోయగ
ఇసక తెన్నులు మిగిలిన ఒడ్డు వలె
రాముని కానక, బాధల తాళక
బలము నాకు తరుగుచున్నది, పిలచినగానీ
మృత్యువు మాత్రము దరి రాకున్నది
రాముని చూడని నాకీబ్రతుకేల
ఏపాపమెరుగని నాకీబాధలేల
కన్నీరెరుగని నాకీశోకమేల
నే పూర్వ జన్మమున చేసిన చేతలు
నాకీ విధముగ దాపురించెనవి
బ్రతుకుపై ఆశలు ఎపుడో ఉడిగిన
నాకిక మృత్యువు ఏల కల్గదు?
బ్రతికే ఆశను నేను చంపితిని
చచ్చెడి స్వేచయు నాకు దూరము
ఎవరి జీవితము వారు ండుపగ
స్వేచయె జీవికి అసలు బహుమతి
లేని జీవితము వ్యర్ధమగును. 20